అమరావతి: 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పేర్ల వివరాల్లో తప్పుల సవరణకు ఈ నెల 19 నుంచి 23 వరకు అవకాశం ఉండనుంది. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల అప్లికేషన్లు ఆన్లైన్లో పొందుపరిచామని, వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొంది.
విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం వంటివి ఇప్పటికే సమర్పించిన నామినల్ రోల్స్‌లో సవరించుకోవచ్చు. హెడ్మాస్టర్లు తమ ఆన్లైన్ లాగిన్ ద్వారా ఈ సవరణలు చేయవచ్చు. ఇందుకోసం ఆపార్ వివరాలతో విద్యార్థుల డీటెయిల్స్‌ను మరోసారి పరిశీలిస్తారు. 2025 మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో విద్యార్థులు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో తరగతులు నిర్వహిస్తోంది.