ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం (2024-25)లో 233 రోజులు పని చేయనున్నాయి. దీనితో పాటు 82 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఉంటాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. టోఫెల్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నేడు తన నిర్ణయం వెల్లడించనుంది. టెఫెల్ తరగతులను కొనసాగించడమా? లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం తరగతుల నిర్వహణపై కసరత్తు చేసి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి. ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2-6 వరకు, ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 3-6 నిర్వహిస్తారు. అలాగే సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15 వరకు, సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి.