24 ఏళ్ల‌ తరువాత వరించిన అదృష్టం.. 98లో ప‌రీక్ష రాస్తే ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగం

Andhra man clears DSC exam in 1998 gets appointment order in 2022.ప్ర‌భుత్వ ఉద్యోగం కావాల‌ని దాదాపుగా ప్ర‌తీ ఒక్క‌రు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 12:32 PM IST
24 ఏళ్ల‌ తరువాత వరించిన అదృష్టం.. 98లో ప‌రీక్ష రాస్తే ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగం

ప్ర‌భుత్వ ఉద్యోగం కావాల‌ని దాదాపుగా ప్ర‌తీ ఒక్క‌రు కోరుకుంటారు. కొంద‌రు క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. మ‌రికొంద‌రు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి అది అంద‌ని ద్రాక్ష‌గానే మిగులుతాది. అలాంటి వారిని ప‌క్క‌వారు ఓదారుస్తుంటారు. నీకు ప్ర‌భుత్వ ఉద్యోగ అదృష్టం లేద‌నుకుంటా. బాధ‌ప‌డ‌కు. మ‌న‌కు అంటూ రాసిపెట్టి ఉంటే ఎప్ప‌టికైనా అది నీ వ‌ద్ద‌కు వ‌స్తుంద‌ని అంటారు. వారు మాట వ‌రుస‌కు అలా చెబుతుంటారు. అయితే.. ఓ వ్య‌క్తి విష‌యంలో అలాగే జ‌రిగింది. ఎప్పుడో 1998లో డీఎస్సీ ప‌రీక్ష‌రాస్తే.. ఇప్పుడు అత‌డికి ఉద్యోగం వ‌చ్చింది. ప‌ద‌వీ విమ‌ర‌ణ వ‌య‌స్సులో అత‌డికి ఉద్యోగం రావ‌డంతో ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాఫిక్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరావు చేనేత కార్మికుల కుటుంబంలో జ‌న్మించారు. టీచ‌ర్ కావాల‌నేది అత‌డి కోరిక‌. అందుక‌నే బీఈడీ పూర్తి చేశాడు. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయాడు. 1998లో డీఎస్సీ రాసినా వివాదాలతో నిలిచిపోయింది. ఇక ఉద్యోగం రాద‌ని బావించిన అత‌డు సైకిల్ పై బ‌ట్ట‌లు అమ్మ‌డం ప్రారంభించాడు. బ‌ట్ట‌లు అమ్ముడు పోయిన‌ప్పుడు మాత్ర‌మే తిండి ఉండేది. అత‌డి త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో అత‌డి ప‌రిస్థితి మరింత దారుణంగా త‌యారైంది. అర‌కొర సంపాద‌న కార‌ణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. ఏదో రోజులు అలా నెట్టుకువ‌స్తున్నాడు.

కాగా.. ఇటీవ‌ల అన్ని అవాంత‌రాలు తొల‌గిపోవ‌డంతో డీఎస్సీ 1998 క్వాలిఫై జాబితాను అధికారులు ప్ర‌క‌టించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న కేదారేశ్వరరావు చాలా సంతోషంగా ఉంద‌ని అన్నాడు. రెండు దశాబ్దాల తర్వాత త‌న కలలు సాకారమయ్యాయని, అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తే విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని గద్గద స్వరముతో ఆయ‌న అన్నాడు.

రావును సోమవారం స్థానికులు ఘనంగా సన్మానించారు. రావు తెలివైన వాడని అయితే చాలా ఆలస్యంగా పదవి వచ్చిందని స్థానికులు తెలిపారు. అతను పదవీ విరమణ చేయడానికి కేవలం ఐదేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉంది.

Next Story