అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విని, వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. విద్యార్థులకు అందిస్తున్న లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు.
పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.
అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే కష్టమని అలాంటిది ఒకేసారి అనేక మంది విద్యార్థులను కంట్రోల్ చేస్తూ పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల గొప్పతనమని అన్నారు. గురువులను గౌరవించాలని, వారి దీవెనలతో జీవితంలో ఎదగగలమని తెలిపారు. పిల్లలు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కనపెట్టి పుస్తకాలు చదవాలని సూచించారు.