అనకాపల్లి బెల్లానికి ఎన్ని కష్టాలో..

Anakapalli jaggery market faces loses due to heavy rains. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి పేరు వింటేనే తియ్యని బెల్లం గుర్తొస్తుంది. ఆ తియ్యదనం అలా నోట్లో నీళ్లూరిస్తుంది. అనకాపల్లి ఆసియా

By అంజి  Published on  19 July 2022 7:23 AM GMT
అనకాపల్లి బెల్లానికి ఎన్ని కష్టాలో..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి పేరు వింటేనే తియ్యని బెల్లం గుర్తొస్తుంది. ఆ తియ్యదనం అలా నోట్లో నీళ్లూరిస్తుంది. అనకాపల్లి ఆసియా ఖండంలో బెల్లం ఎగుమతులకు ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బెల్లం బట్టీలు ఉన్నాయి. అయినా అనకాపల్లి ఏరియాలో పండించే చెరుకు అన్నా, ఇక్కడ తయారయ్యే బెల్లం అన్నా చాలా మందికి ఇష్టం. అలాంటి ఇష్టమైన బెల్లానికి ఇప్పుడు వర్షాల రూపంలో కష్టాలొచ్చాయి.

10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల బెల్లం లావాదేవీలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆన్‌ సీజన్‌ కారణంగా మార్కెట్‌కు బెల్లం దిమ్మలు రావడం లేదు. దానికి తోడుగా ముసురు కురుస్తుండటంతో బెల్లం మార్కెట్‌ నష్టాల్లోకి వెళ్లిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల నుంచి 10 బెల్లం దిమ్మలు కూడా అమ్ముడు పోలేదని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు బెల్లం బట్టీల నుంచి బెల్లం దిమ్మలు రావడం తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. కొద్దో, గొప్పో వచ్చే బెల్లం దిమ్మలు కూడా నాణ్యత లోపించి వస్తుండటంతో ధర బాగా పడిపోయింది.

క్వింటాల్ బెల్లం ధర

ప్రస్తుతం క్వింటాల్ బెల్లం దిమ్మల ధర 2,250 నుండి 3,800 మధ్య పలుకుతుంది. గోదావరి జిల్లాలను భారీ వరదలు ముంచెత్తడంతో అక్కడి నుంచి వచ్చే కూడా ఆగిపోయింది. ప్రస్తుతం కోల్డ్ స్టోరీజీలో నిలువ ఉంచిన స్టాక్‌ను మాత్రమే డిమాండ్ మేరకు బయటకు తీస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ బెల్లం ధరలు రోజురోజుకీ పడిపోతున్నాయనీ.. కొత్త బెల్లం రావాలంటే దసరా వరకూ ఆగాల్సిందే అనీ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు నార్త్‌ ఇండియాలో బెల్లం డిమాండ్‌ కూడా తగ్గిపోయింది.

120 ఏళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం మార్కెట్

అనకాపల్లి బెల్లం మార్కెట్‌ ఏర్పడి 120 ఏళ్లు అయింది. బ్రిటీష్ పాలన సమయంలో ఇక్కడ తయారయ్యే బెల్లానికి ఎంతో డిమాండ్ ఉండేది. అప్పట్లో ఈ మార్కెట్ అనకాపల్లి లోని బాలాజీ పేటలో ఉండేది. అయితే 2002లో దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోకి మార్చారు. ఏకంగా 32-33 ఎకరాల విస్తీర్ణంలో ఈ బెల్లం మార్కెట్ విస్తరించి ఉంది. స్వీట్ మార్కెట్స్‌లో అనకాపల్లి బెల్లం అంటే మంచి క్రేజ్ ఉంది. అయితే అన్ సీజన్‌కు తోడు .. వారం రోజులుగా ముంచెత్తిన వర్షాలు అనకాపల్లి బెల్లం మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Next Story