మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా?
Anagani Satyaprasad Letter to Assembly Privileges Committee. శాసనసభలో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు కింజారపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు
By Medi Samrat Published on 23 Sept 2021 4:35 PM ISTశాసనసభలో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు కింజారపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మైకు ఇవ్వరాదంటూ శాసనసభా హక్కుల సంఘం చేసిన తీర్మానంపై పునరాలోచన చేయాలని కోరుతూ ప్రివిలేజెస్ కమిటీ ఛైర్మన్ కి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ లేఖ రాశారు. శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం యొక్క బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు.
ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదికపై ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ ఉపపక్ష నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదని.. సభ్యుల వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. ప్రజాహితం కోరేవారు ఎవరైనా ప్రజల తరపున ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటారని రాసుకొచ్చారు.
ప్రతిపక్షం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడమే నేరంగా, ప్రజలపక్షాన మాట్లాడడం ఘోరంగా భావిస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీ నేతలను శత్రువులుగా చూసే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమంటే రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం హక్కును కూడా నిర్వీర్యం చేయడమేనని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోని నేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా? నిలదీయలేదా? స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పుకునే చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. ప్రివిలేజ్ కమిటీకి వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని అన్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడులకు మరో అవకాశం ఇచ్చి సభ గౌరవాన్ని పెంపొందించాల్సిందిగా కోరుతున్నానని సత్య ప్రసాద్ లేఖ రాశారు.