రఘురామను చంపేందుకు ప్రొఫెషనల్ కిల్లర్స్ ను నియమించారట..!
An unidentified person at Raghuramakrishna Raju's residence. ప్రధాని నరేంద్రమోదీ ఏపీలోని భీమవరం పర్యటనకు తాను హాజరుకాలేనని
By Medi Samrat Published on 4 July 2022 8:49 AM GMT
ప్రధాని నరేంద్రమోదీ ఏపీలోని భీమవరం పర్యటనకు తాను హాజరుకాలేనని రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఆయన దిగిపోయారు. ఈ క్రమంలో తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
''భీమవరంలో నా అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులుండటంతో సుమారు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. నేను వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారు. నేను భీమవరం వెళ్లకపోతే వాళ్లను వదిలేస్తామని పోలీసులు చెప్పారు. తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నా. నా కోసం ఎవరూ భీమవరం రావొద్దు'' అని రఘురామ చెప్పుకొచ్చారు.
తనను చంపేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ ను నియమించారని.. తన హత్యకు ప్లాన్ చేశారని రఘురామ ఆరోపించారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడని, అతడిని పట్టుకోగా తాను పోలీస్ అని చెప్పారని ఆయన తెలిపారు. అతడిని గుర్తించిన రఘురామ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. విజయవాడ నుంచి వచ్చినట్లు ఆ అగంతకుడు చెప్పాడని సిబ్బంది తెలిపారు. అతడి పేరు సుభాన్ అలియాస్ బాషగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు దుండగులు వచ్చారని.. అందులో ఒకరిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు రఘురామ సిబ్బంది చెప్పారు.