Prakasam: రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు.. చివరికేమైందంటే?

రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రూ.40 లక్షల విలువైన పొగాకు దగ్ధమైంది.

By అంజి  Published on  14 March 2023 5:33 AM GMT
Ambulance,Andhra Pradesh,fire accident,tobacco

రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు

అమరావతి: రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రూ.40 లక్షల విలువైన పొగాకు దగ్ధమైంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌లో డయాలసిస్‌ కోసం ఒక రోగిని రాజాసాహెబ్‌పేట గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ తిరుపతిరావు క్యాబిన్‌లో పొగలు రావడం గమనించాడు. వెంటనే అంబులెన్స్‌ను ఆపి సహచరుడు మధుసూధన్‌రెడ్డిని అప్రమత్తం చేశాడు. తరువాతి రోగికి, అతనితో పాటు ఉన్న అతని తల్లికి దిగడానికి సహాయం చేశారు.

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు కొద్దిసేపటికే వాహనం మొత్తం వ్యాపించాయి. అంబులెన్స్‌లో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దాని తాకిడికి వాహనంలోని కొంత కాలిన పదార్థం సమీపంలోని రైతులు పొగాకు నిల్వ చేసిన షెడ్‌పై పడిపోయింది. దీంతో మొత్తం పొగాకు స్టాక్ బూడిదగా మారింది. షెడ్డు దగ్గర నిలబడిన వ్యక్తికి కూడా కాలిన గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అగ్నిమాపక యంత్రం అక్కడికి చేరుకుంది. అయితే ఆ సమయానికి మొత్తం అంబులెన్స్, పొగాకు స్టాక్ పూర్తిగా దగ్ధమైంది. రూ. 40 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డులో పొగాకు నిల్వ ఉంచిన ముగ్గురు రైతులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story