భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. జైల్లో ఉన్న కృష్ణవేణిని ములాఖత్ ద్వారా వైసీపీ నేత అంబటి రాంబాబు కలిశారు. పాలేటి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా వ్యవహరించారని అంబటి రాంబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. పొన్నూరు భాస్కర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయంత్రం 5 గంటలకు కృష్ణవేణిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి దాచేపల్లికి తీసుకెళ్లారని, మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్ లోనే ఉంచారన్నారు. కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యకరంగా మాట్లాడారని, వైసీపీ నేతల పేర్లు చెప్పమని కృష్ణవేణిని హింసించారన్నారు. కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని బెదిరించారని, కృష్ణవేణిపై వ్యభిచారం కేసు కూడా పెడతానని భయపెట్టారన్నారు.