బాబుతో యుద్ధమైతే 5 నిమిషాల్లో ముగించేస్తాం
Ambati Rambabu Criticises Chandrababu. కుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం వైఎస్ జగన్ అని వైసీపీ సీనియర్ నేత
By Medi Samrat Published on 9 July 2022 2:30 PM ISTకుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం వైఎస్ జగన్ అని వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ రెండవ రోజు ప్లీనరిలో ఆయన మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే అత్యంత ప్రజాదరణ పొంది 151 సీట్లును గెలుచుకుని ఆంధ్రరాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిరోహించిన ధీరుడని కొనియాడారు. 3,648 కిలోమీటర్లు ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి, ఒంటిచేత్తో ప్రతిపక్షాలను మట్టి కరిపించిన వీరుడుగా అభివర్ణించారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ నాయకత్వంలో ప్రజలు మూడేళ్ల క్రితం ఎన్నుకున్నారు. మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మిగిలిన రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నాక, మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీసులు పొంది మరోసారి వన్స్‌మోర్ అనిపించుకుని మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతున్నామని అన్నారు.
సీఎం జగన్ మూడేళ్ల పాటు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు వివరించి, వాళ్ల ఆశీస్సులు పొందాలని సూచించారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి గడప గడపకు, ఇంటింటికి వెళుతున్నాం. ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ జగన్ జగన్ అనే నినాదమే మారుమోగుతోంది. మళ్లీ రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఎన్నికవుతారు. ఇది సత్యం అని అన్నారు.
ఈ నేపధ్యంలో అధికారం లాక్కోవాలని, తనది కాని అధికారాన్ని అనుభవించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాపత్రాయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఒక్కడైతే ఫరవాలేదు. మన ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారు. చంద్రబాబుతో యుద్ధం అయితే అయిదు నిమిషాల్లో పూర్తి చేస్తాం. కానీ చంద్రబాబుతో కాదు ఎన్నికల యుద్ధం. ఆయన వెనక ఉన్న దుష్టచతుష్టయంతో అని వివరించారు.
పేదలు చదువుకునే బడులు, ప్రభుత్వ ఆస్పత్రులను నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగుచేసిన మహానుభావుడు వైఎస్ జగన్.. ఇది మాత్రం వారికి కనిపించదు. ఈ విషయాన్ని గురించి, ఫ్రంట్ పేజీలో ఒక్క ముక్క కూడా రాయరని విమర్శించారు. నిత్యం, కుళ్లు, కుతంత్రాలతో అబద్ధాలు, అసత్యాలతో, ఏవేవో కట్టుకథలు రాసి మసిపూసి మారేడుకాయ చేసి జగన్ మీద బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.
ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే అధికారంలోకి రావాలనుకుంటారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కానీ ఒకాయన పార్టీ పెట్టాడు. అయితే ఆయన అధికారంలోకి రావాలని కనీసం కోరిక కూడా కోరుకోడు. చంద్రబాబు అధికారంలోకి రావాలి. ఆయనకు కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. ఆయనే చంద్రబాబు దత్తపుత్రుడు. ఆయన పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా నటుడు కదా.. మీటింగుల్లో ఆయనను సీఎం సీఎం అంటుంటే.. ఈయనేమో ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడని పవన్‌పై విమర్శలు గుప్పించారు.