అమరావతే శాశ్వతం.. అడ్డుపడే మేఘాలు అశాశ్వతం : రఘురామ

Amaravati Parirakshana Samithi Meeting In Tirupati. అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్

By Medi Samrat  Published on  17 Dec 2021 1:52 PM GMT
అమరావతే శాశ్వతం.. అడ్డుపడే మేఘాలు అశాశ్వతం : రఘురామ

అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్ర నిర్వహించిన రైతులు నేడు తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీపీఎం నేతలు తప్ప మిగిలిన అన్ని విపక్షాల నేతలు హాజరయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పరిటాల సునీత, గౌతు శిరీష, సినీ నటుడు శివాజీ, పాతూరి నాగభూషణం, బీజేపీ, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ స‌మావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.

తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన సభకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. ఇది రాజకీయ సభ కాదని, దగాపడ్డ రైతుల సభ అని రఘురామకృష్ణరాజు చెప్పారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాలు తరలి వస్తున్నాయని.. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. అమరావతే శాశ్వతమని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు. ఈ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణరాజు ఆలింగనం చేసుకున్నారు. సభ వేదికపైకి చంద్రబాబు రాగానే రఘురామ ఆత్మీయంగా పలకించారు. అమరావతి పరిరక్షణ పేరిట రెండేళ్ళ నుంచీ ఉద్యమం కొనసాగిస్తున్న రాజధాని రైతులు 44 రోజుల పాటు సాగించిన మహా పాదయాత్రను ఈనెల 14న తిరుపతిలో ముగించారు.


Next Story