ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గుర్తించింది. సులభమైన జీవనానికి అనుకూలంగా,ఈ నగరం భవిష్యత్తులో ఒక మోడల్ సిటీగా నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఉన్న నగరాల్లో సేవల లోపం,అనధికార నిర్మాణాల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించడానికి మార్పులు చేయడం కంటే, గ్రీన్‌ఫీల్డ్ విధానంలో కొత్త నగరాన్ని నిర్మించడం ద్వారా ముందే ప్రణాళికాబద్ధంగా జీవన వ్యవస్థను రూపకల్పన చేయవచ్చని ఆర్థిక సర్వే వివరించింది.
సర్వే ప్రకారం, భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాలకంటే, విద్య, ఆరోగ్యం, వ్యాపారం వంటి రంగాలతో సమన్వయం సాధించే నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అమరావతి ఈ విధంగా కచ్చితమైన ప్రణాళికతో నిర్మించబడిన ఒక దృష్టాంతంగా నిలుస్తుందని సర్వే స్పష్టం చేసింది. దేశంలోని పది నివాస యోగ్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ నగరాలు చోటు దక్కించుకున్నాయి. వీటి జీవన సౌలభ్యత సూచికలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.