అమ‌రావ‌తి రైతుల కీల‌క నిర్ణ‌యం.. పాద‌యాత్ర‌కు తాత్కాలిక బ్రేక్‌

Amaravati farmers announced a 4 days break for the Padayatra.అమ‌రావ‌తి రైతులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 11:37 AM IST
అమ‌రావ‌తి రైతుల కీల‌క నిర్ణ‌యం.. పాద‌యాత్ర‌కు తాత్కాలిక బ్రేక్‌

అమ‌రావ‌తి రైతులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పాద‌యాత్ర‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించారు. పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని న్యాయ‌స్థానంలోనే తేల్చుకుంటామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కోర్టుకు సెల‌వులు ఉన్నందున పాద‌యాత్ర‌కు నాలుగు రోజులు తాత్కాలిక విరామేన‌ని ఐకాస నేత‌లు తెలిపారు.

అమ‌రావ‌తి రైతులు త‌ల‌ప‌ట్టిన పాద‌యాత్ర 41వ రోజుకు చేరుకుంది. ఈరోజు(శ‌నివారం) డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌మ జిల్లా రామ‌చంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. రామచంద్రాపురం నుంచి విజయ రాయుడుపాలెం వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర సాగాల్సి ఉంది. అయితే.. రైతులు బ‌స చేస్తున్న ఫంక్ష‌న్ హాల్‌ను పోలీసులు చుట్టుముట్టారు. రైతుల‌కు మ‌ద్దుతు తెలిపేందుకు బ‌య‌టి నుంచి వ‌చ్చిన ఎవ్వ‌రిని లోప‌లికి అనుమ‌తించ‌డం లేదు.

ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా పాద‌యాత్ర‌లో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపాల‌ని, అనుమ‌తి ఉన్న వాహ‌నాలు కాకుండా మిగ‌తావి అంగీక‌రించ‌బోమ‌ని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు, రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదం నెల‌కొంది. పోలీసుల తీరుపై మండిప‌డిన ఐకాస నేత‌లు స‌మావేశం అయ్యారు. ఈ క్ర‌మంలోనే పాద‌యాత్ర‌ను తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. పోలీసుల తీరుపై హైకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రస్తుతం హైకోర్టుకు నాలుగు రోజుల పాటు దీపావ‌ళి సెల‌వులు ఉండ‌డంతో సెల‌వుల అనంత‌రం న్యాయ‌స్థానంలో పోలీసుల తీరుపై ఫైట్ చేస్తామ‌న్నారు. కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌తో అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

Next Story