అల్లు అర్జున్, ఎమ్మెల్యే రవిలపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదు చేసారు.
By Medi Samrat Published on 12 May 2024 8:18 AM ISTఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదు చేసారు. అల్లు అర్జున్ శనివారం నంద్యాలలోని తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. దీంతో వేలాది మంది ప్రజలు అతడిని చూసేందుకు గుమిగూడారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమంపై శనివారం సాయంత్రం అల్లు అర్జున్ పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిపై కేసు నమోదు చేశారు.
ప్రచారం చివరి రోజు తన మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ ఎమ్మెల్యే రవి ఇంటికి వెళ్లారు. అతని పర్యటన గురించి తెలుసుకున్న అభిమానులు.. తమ అభిమాన నటుడిని చూసేందుకు ఎమ్మెల్యే ఇంటి ఎదుట పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, శిల్పా రవి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీలో కనిపించిన వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. అభిమానులు 'పుష్ప, పుష్ప' అంటూ నినాదాలు చేస్తుండగా.. అల్లు అర్జున్ భారీ జనసమూహం వైపు చేతులు ఊపాడు. ఈ ఘటనపై నంద్యాల స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేయబడింది. ఎన్నికల కోడ్ సెక్షన్ 144, ఏపీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 31 అమలులో ఉన్నందున అల్లు అర్జున్, ఎమ్మెల్యే రవిపై కేసు నమోదు చేశారు.
ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఇచ్చినందుకు నంద్యాల ప్రజలకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
మే 13న జరగనున్న ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవి అసలు పేరు సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి.