నాలుగు నెలల్లో ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్‌న్యూస్

రాజ‌ధాని రైతుల‌కు ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేష‌న్లపై కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 7:41 PM IST

నాలుగు నెలల్లో ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్‌న్యూస్

రాజ‌ధాని రైతుల‌కు ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేష‌న్లపై కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు. రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. రాబోయే నాలుగు నెల‌ల్లో రైతుల‌కు కేటాయించాల్సిన ప్లాట్ ల‌తో పాటు రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు మంత్రి. స‌చివాల‌యంలో మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తి విష‌యంలో ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నామ‌ని అన్నారు. అమ‌రావ‌తిలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ‌, 2014-19 మ‌ధ్య కాలంలో, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ గురించి లెక్క‌ల‌తో స‌హా మీడియా ముందు వివ‌రించారు మంత్రి నారాయ‌ణ‌.

అమ‌రావ‌తి కోసం భూస‌మీక‌ర‌ణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుంచి 34,911.23 ఎక‌రాల‌ను సీఆర్డీఏ ద్వారా తీసుకోవాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వీటిలో ఇప్ప‌టివ‌ర‌కూ 29,644 మంది రైతుల‌కు సంబంధించిన 34,192.19 ఎక‌రాల‌కు ప్లాట్ ల కేటాయింపు పూర్త‌యింద‌న్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలోనే 26,197 మంది రైతుల‌కు సంబంధించిన 31,003.38 ఎక‌రాల‌కు ప్లాట్ల కేటాయింపు పూర్తి కాగా.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన ఇప్ప‌టివ‌ర‌కూ 2727 మంది రైతుల‌కు సంబంధించిన 3188.81 ఎక‌రాల‌కు ప్లాట్ల కేటాయింపు పూర్త‌యింద‌న్నారు. ఇంకా 991 మంది రైతుల‌కు సంబంధించిన 719.04 ఎక‌రాల‌కు ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉంద‌న్నారు..వీటిలో ఉండ‌వ‌ల్లిలో లేఅవుట్ ఫైన‌ల్ కాక‌పోవ‌డం,లంక భూములు,కోర్టు కేసులు, పీఓటీ కేసులు, 12 సెంట్ల లోపు ఉన్న భూములు ఉన్నాయ‌న్నారు.

ఇక రిట‌ర్న‌బుల్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ కూడా వేగంగా జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. మొత్తం 29,233 మంది రైతుల‌కు 69,421 ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ చేయాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కూ 26,732 మంది రైతుల‌కు 60,980 ప్లాట్ లు రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇంకా 2501 మంది రైతుల‌కు 8441 ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయాల్సి ఉంద‌న్నారు. వీటిలో కోర్టు కేసులున్న‌వి 70 మంది రైతుల‌కు చెందిన 312 ప్లాట్లు, ల్యాండ్ ఎక్విజిష‌న్ పెండింగ్ ప్రాంతంలో 254 మంది రైతుల‌కు చెందిన 1170 ప్లాట్లు,వివాదాల్లో 450 మందికి చెందిన 1889 ప్లాట్లు,పీఓటీ కుసుల్లో 78 మంది రైతుల‌కు చెందిన 208 మంది ప్లాట్లు, దేవ‌దాయ శాఖ వివాదంలో 32 మంది రైతుల‌కు చెందిన 69 ప్లాట్లు, లంక అసైన్డ్ భూములు 170 మంది రైతుల‌కు చెందిన 337 ప్లాట్లు, ఎన్ ఆర్ ఐలు 210 మందికి చెందిన 444 ప్లాట్లు ఉన్నాయి. ఆయా పెండింగ్ ప్లాట్ల కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ల ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. ప్ర‌స్తుతం రోజుకు 60 నుంచి 90 ప్లాట్ల వ‌ర‌కూ రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నాయ‌న్నారు.

అలాగే రైతుల‌కు చెల్లించే కౌలు న‌గ‌దుపైనా మంత్రి స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించి 231.03 కోట్ల న‌గ‌దు చెల్లించ‌గా మ‌రో 484 మంది రైతుల‌కు 3.15 కోట్లు వివిధ సాంకేతిక కార‌ణాల‌తో పెండింగ్ లో ఉన్న‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. అలాగే గ‌త రెండు ఆర్ధిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించి 319 మంది రైతుల‌కు 1.03 కోట్లు పెండింగ్ లో ఉన్న‌ట్లు చెప్పారు. కోర్టు కేసులతో పాటు చ‌నిపోయిన వారికి సంబంధించిన వివాదాల‌తో పెండింగ్ ఉన్న‌ట్లు మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు.

Next Story