అనంతపురం జిల్లాలో టెన్షన్‌.. ఆ ముగ్గురికి పాజిటివ్‌.. వేరియంట్‌ను గుర్తించేందుకు..

All three are corona positive in Anantapur district. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం కలకలం రేపుతోంది. ఇటీవల అనంతపురానికి పొరుగున ఉన్న బెంగళూరులో

By అంజి  Published on  6 Dec 2021 4:26 AM GMT
అనంతపురం జిల్లాలో టెన్షన్‌.. ఆ ముగ్గురికి పాజిటివ్‌.. వేరియంట్‌ను గుర్తించేందుకు..

ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం కలకలం రేపుతోంది. ఇటీవల అనంతపురానికి పొరుగున ఉన్న బెంగళూరులో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరుకు, అనంతపురానికి రాకపోకలు నిత్యకృత్యం కావడంతో.. ఒమిక్రాన్‌ మహమ్మారి ఏ సమయంలోనైనా జిల్లాలోకి ప్రవేశిస్తుందని ప్రజల్లో భయం ఆవరించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.

నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు ఎంత మంది విదేశాల నుండి వచ్చారన్న దానిపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి నేతృత్వంలో అనంతపురం బీసీ స్టడీ సర్కిల్‌లో స్పెషల్‌ టీమ్‌ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 471 మంది విదేశాల నుండి జిల్లాకు వచ్చినట్లు గుర్తించారు. వారిలో 410 మంది అడ్రస్‌లను ప్రత్యేక బృందం గుర్తిస్తోంది. కాగా ఇప్పటికే 410 మంది జాబితాలోని 252 మందిని గుర్తించి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో ముగ్గురు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. వారికి సోకిన వేరియంట్‌ గురించి తెలుసుకునేందుకు నమునాలను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉందని హైదరాబాద్‌ సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌కు వస్తున్న విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌ సోకిన వారి నమూనాలు తమ ల్యాబ్‌ వస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా చిన్న యంత్రం నానోపై నమునాలను కనుగొంటున్నామని తెలిపారు. ఫలితాలు వచ్చేందుకు 48 గంటల సమయం పడుతుందన్నారు. ఒమిక్రాన్‌తో పాటు ఏ వేరియంట్‌ వచ్చినా కూడా అది.. ఒక్క డోసు వ్యాక్సిన్‌ కూడా తీసుకోని వారిపై అధిక ముప్పు కలిగిస్తుందన్నారు.

Next Story