జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరికి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. జనసేన బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతకుముందు జనసేన పార్టీ కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అందరూ హాజరుకావాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సభకు గ్రామాల నుంచి ప్రజలు క్షేమంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగింది, ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై సభలో మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు లేవనెత్తే సందేహాలు, విమర్శలకు సమాధానం చెప్పబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలుగు ప్రజల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. సమావేశ మందిరానికి తన అభిమాన నాయకుడు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారని వివరించిన ఆయన, సంజీవయ్య స్ఫూర్తితో తన ప్రసంగం సాగుతుందని వెల్లడించారు.