ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల వివాదాలు చెలరేగుతున్నాయి. కొత్త జిల్లాలో ఏర్పాటుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కొత్త పేర్లు, డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. జిల్లాలపై ప్రతిపక్షాల నాయకులతో పాటు అధికార పక్షంలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. కాగా జిల్లాల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలకు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. ఇదే విషయమై తాజాగా టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు పేరు తెర మీదకు వచ్చింది. అక్కినేని అభిమానులు.. తమ జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో మచిలీపట్నం ఒకటి. అయితే జిల్లాకు దివంగత నటుడు ఏఎన్‌ఆర్ పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు.
ఏపీ ప్రభుత్వం తమ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరారు. అక్కినేని నాగేశ్వరరావు గుడివాడ రామపురంలో జన్మించారు. తన విలక్షణమైన నటన, విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. దాదాఫాల్కే అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు ఏఎన్‌ఆర్. సినీ ప్రపంచాన్ని మద్రాస్ నుండి ఆంధ్రాకు తీసుకువచ్చారని అక్కినేని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. కళారంగానికి ఏఎన్‌ఆర్ చేసిన సేవలను గుర్తించి.. ఆయన పేరుతో మచిలీపట్నం జిల్లాకు పేరు పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.