వైఎస్‌ జగన్‌కు అఖిలేష్‌ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ చేస్తున్న ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ మద్ధతు తెలిపారు.

By అంజి  Published on  24 July 2024 1:41 PM IST
Akhilesh Yadav, YS Jagan, Delhi, YCP, APnews

వైఎస్‌ జగన్‌కు అఖిలేష్‌ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ చేస్తున్న ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడలు సరికాదన్నారు. ''ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు సంయమనం పాటించాలి. దాడులతో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? కార్యకర్తల గురించి జగన్‌ పోరాడటం అభినందనీయం'' అని అఖిలేష్‌ అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. జగన్‌ తనకు ఫోటోలు, వీడియోలు చూపెట్టిన తర్వాత అర్ధమైందని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

''నిన్నటి వరకు జగన్‌ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన (చంద్రబాబు) సీఎంగా ఉన్నారు. రేపు మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి కావొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్‌ సంస్కృతిని మా సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదు. దాన్ని తప్పు పడుతున్నాం. చివరకు ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్‌ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారు?. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదు. ప్రజలు సంతోషంగా జీవించాలి. ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో.. వారు మంచి ముఖ్యమంత్రి కారు. అలాగే అది సుపరిపాలన కాదు. మంచి ప్రభుత్వం కాదు'' అని అఖిలేష్‌ అన్నారు.

Next Story