ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీ తన సత్తా చాటాలని భావించింది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు ఉన్న కార్పొరేషన్లలో ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆయన ఆశించినన్ని స్థానాల్లో ఎంఐఎం విజయాలను అందుకోలేకపోయింది. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో మాత్రమే ఖాతా తెరిచింది.
హిందూపురం మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. ఎంఐఎం ప్రధానంగా రాయలసీమపై దృష్టి సారించినప్పటికీ.. హిందూపురంలో తప్ప మరెక్కడ ఎంఐఎం గెలువలేదు. గతంలో కర్నూలు జిల్లాకే పరిమితమైన ఆ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో పోటీ చేసింది. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లో పోటీ చేసింది. విజయవాడ కార్పొరేషన్‌లో 50, 54 డివిజన్లలో పోటీలో తలపడ్డారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని ఆదోని, అనంతపురం జిల్లాలో హిందూపురం మున్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. కానీ హిందూపురంలో మాత్రం ఒక వార్డులో విజయాన్ని అందుకుంది.