లోకేష్ హామీ.. ఆంధ్రా తరుపున ఆడేందుకు సిద్ధమైన హనుమ విహారి
సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 25 Jun 2024 2:00 PM GMTసీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఇకపై ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడనని కూడా చెప్పాడు. అయితే.. విహారి ఇప్పుడు రాష్ట్రం కోసం ఆడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
“సంవత్సరాలుగా, నేను చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. అదే నన్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లేలా చేసింది. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌ని కలిసిన తర్వాత.. నేను నా తెలుగు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందనే హామీ వచ్చింది. నేను ACAకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాను" అని హనుమ విహారి ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.
భారత్ తరుపున 16 టెస్టులు ఆడిన హనుమ విహారి.. ఆంధ్రా కెప్టెన్‌గా సీజన్‌ను ప్రారంభించాడు, అయితే గతేడాది రన్నరప్ బెంగాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత తప్పుకున్నాడు. ఇంతకుముందు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విహారి ఇలా అన్నాడు.. “విషాదకరమైన విషయం ఏమిటంటే.. తాము ఏది చెప్పినా ఆటగాళ్ళు వినాలని అసోసియేషన్ భావిస్తుంది. వారి కారణంగా ఆటగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయిన ఆంధ్రా తరపున ఎప్పటికీ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను జట్టును ప్రేమిస్తున్నాను. మేము ప్రతి సీజన్‌లో ఎదుగుతున్నామని నేను భావిస్తున్నాను కానీ అసోసియేషన్ మేము ఎదగాలని కోరుకోవడం లేదు.
ఆ సమయంలో.. 'వ్యక్తిగత కారణాల' కారణంగా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయింయుకున్నట్లు విహారి చెప్పాడు. అయితే ఆ తర్వాత అసోసియేషన్ తనను రాజీనామా చేయమని కోరినట్లు పేర్కొన్నాడు. మితిమీరిన రాజకీయ జోక్యంతో అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన స్టార్ క్రికెటర్ హనుమ విహారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి రాష్ట్రానికి స్వాగతిస్తున్నట్లు నారా లోకేష్ మంగళవారం హామీ ఇచ్చారు.
‘‘క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ప్రాథమిక వాస్తవాన్ని మరిచి నియంతృత్వ ధోరణితో వ్యవహరించిన రాజకీయ పార్టీని ప్రజలు పెద్దఎత్తున తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న పీ శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించి గత ప్రభుత్వం రాజకీయ క్రీడను ప్రారంభించింది’’ అని లోకేశ్ అన్నారు.
టీమ్‌లో 17వ ఆటగాడిగా ఉన్న వైసీపీ నాయకుడు కుంట్రపాకం పృథ్వీరాజ్ కుమారుడిని ప్రమోట్ చేయడం కోసమే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని వేధించిందని.. అవమానించిందని లోకేష్ పేర్కొన్నారు.
“ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పనితీరుతో పూర్తిగా విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేను వెంటనే స్పందించి హనుమ విహారికి అండగా నిలిచాం’’ అని లోకేష్ నోట్‌లో పేర్కొన్నారు.
అన్ని ఆటల్లోనూ క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, హనుమ విహారికి ఇచ్చిన హామీ మేరకు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని నారా లోకేష్ తెలిపారు.