ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. వచ్చే నవంబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం), పీఆర్సీ, ఇతర బకాయిలను చెల్లించనుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత బకాయిలను ప్రభుత్వం నవంబరులోగా చెల్లిస్తుందని ఆశిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. దసరా పండగకు ముందే ఒక డీఏ బకాయి చెల్లించారని.. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. ఉద్యోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12వ పీఆర్‌సీ కమిషన్ ఇప్పటికే తన పనిని ప్రారంభించిందన్నారు. నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.