నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ మొత్తం ఆర్‌ఆర్‌ఆర్ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్ చేశారాయన.
అయితే బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ భారత్ పరువు తీయవద్దని సలహా ఇచ్చారు. ప్రత్యేకవాదాన్ని చూపించవద్దని అది దేశాన్ని కించపరచడమేనని అన్నారు. తెలుగు ఫ్లాగ్ అంటే ఏమిటని సమీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మనం మొదట భారతీయులమని.. అందుకే.. మొదట మీరు బారత్ లోనే ప్రత్యేకమని ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఈవెంట్స్ విషయాల్లో మనదంతా ఓ దేశం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. సెపరేటిస్ట్ ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మనం 1947లో చూశామన్నారు.
2023 గోల్డెన్ గ్లోబ్స్ లో 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ట్రోఫీని అందుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.