2025 - 26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మంది విద్యార్థులకు రూ.953 కోట్లతో కిట్లు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన జిఓ 35ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం విడుదల చేశారు. రూ.175.03 కోట్లు కేంద్రం, రూ.778.68 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
ప్రభుత్వం అందించే కిట్‌లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం ఉంటాయి. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1 నుంచి 8 క్లాసుల వారికి రూ.120, 9,10 క్లాసుల వారికి రూ.240 చెల్లించనుంది. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)కు 35,94,774 మంది విద్యార్థులకు వీటిని అందించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్ ఇవ్వడానికి రూ.1858.50 వ్యయం కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది.