సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా
Adjournment of hearing on the petition filed by Sunitha Reddy. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతూ
By Medi Samrat Published on 9 Jun 2023 3:30 PM ISTకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు విన్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారు అని వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. స్థానిక ప్రభుత్వం కూడ అవినాష్ రెడ్డికే మద్దతిస్తుందని సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. సీబీఐ విచారణను వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది సీబీఐ. కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి కుట్ర పన్నారని నివేదికను కోర్టుకు సమర్పించింది. సాక్ష్యాల చెరిపివేతలో వారిద్దరి పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని మే 5న కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. అందులో పలు అంశాలు ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. ఇంతకు ముందు దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీబీఐ తెలిపింది. భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.