ఫస్ట్ ఏపీలోనే సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్.. ఏ జిల్లాలో అంటే..

Actor Sonu sood's first oxygen plant in AP. మొదటి రెండు ప్లాంట్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు సోనూ. కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 7:30 AM GMT
Sonu soods first oxygen plant

క‌రోనా లాక్‌డౌన్ నుంచి పేద‌ల‌కు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అని అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా త‌న వంతు సేవ‌లు అందిస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. క‌రోనా రోగులు ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ దొర‌క‌క ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి బాధ‌ను చూడ‌లేని సోనూసూద్‌.. వీలైనంత మందికి ఆక్సిజ‌న్ అందించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే యూఎస్‌, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజ‌న్ ఫ్లాంట్లు తెప్పించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ ఫ్లాంట్ల‌ను వివిధ రాష్ట్రాల్లోని అవ‌స‌ర‌మైన ఆస్ప‌త్రుల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పాడు.

కాగా.. మొదటి రెండు ప్లాంట్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు సోనూ. కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తున్నారు. సోనూసూద్ టీం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది. తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే కావాల్సిన అన్ని అనుమ‌తుల‌ను అధికారుల నుంచి తీసుకున్నారు.

'ఈ ప్లాంట్స్ కోవిడ్ -19తో ధైర్యంగా పోరాడటానికి అవసరమైన వారికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం.. ఆంధ్రప్రదేశ్ తరువాత.. మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల నిరుపేద ఆసుపత్రులను గుర్తించాము. అని' సోనూసూద్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత.. జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


Next Story