రెండురోజుల పాటు మా అధినేత‌ను ఇబ్బంది పెట్టారు : అచ్చెన్నాయుడు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, పార్టీ సీనియర్ నేత

By Medi Samrat  Published on  25 Sep 2023 3:30 PM GMT
రెండురోజుల పాటు మా అధినేత‌ను ఇబ్బంది పెట్టారు : అచ్చెన్నాయుడు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును భువనేశ్వరి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను చంద్రబాబుకు అచ్చెన్నాయుడు వివరించారు.

ములాఖత్ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పనికిమాలిన, సంబంధం లేని ప్రశ్నలు వేశారని, రెండురోజుల పాటు ఆయనను ఇబ్బంది పెట్టారన్నారు. తమ పార్టీ అధినేతను జైల్లోనే ఉంచేందుకు కేసు మీద కేసు వేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఆయన ధైర్యంగా ఉన్నారని, ధైర్యంగా పోరాడాలని తమకు సూచన చేశారన్నారు. జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేసి ముందుకు సాగాలని చెప్పారన్నారు. చంద్రబాబు అవినీతి అని చెప్పడమే తప్ప ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. నారా లోకేష్ ఢిల్లీలో తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెప్పారని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని అన్నారు. త్వరలో యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందని.. అనుమతులు తీసుకున్నాక పాదయాత్రను ప్రారంభిస్తామన్నారు. జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని, పోరాటపటిమతో ఉన్నారన్నారు. ఆయన సలహాలు, సూచనలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామన్నారు.

Next Story