తూర్పుగోదావరి జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆలమూరు మండలం జొన్నాడ ప్రాంతం జాతీయ రహదారిపై ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన బస్సు చెట్టును ఢీకొని ధ్వంసం కాగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఘటనకు సంబంధించి ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలు కేరళ రాష్ట్రంలో పనికి వెళుతుండగా.. జొన్నాడ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి (వాహనంలో సాంకేతిక లోపం ఏర్పడి) బస్సు బ్రేకులు ఫెయిల్ అవటంతో ఒక్కసారిగా జాతీయ రహదారి పక్కనున్న చెట్టును ఢీ కొట్టి ఆగిపోయిందని తెలిపారు.
పక్కనే పెద్ద కాలువ ఉండటం.. బస్సు చెట్టును ఢీ కొట్టి ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.. లేదంటే కాలువలోకి దూసుకువెళ్లి భారీ ప్రాణ నష్టమే జరిగి ఉండేదని ఎస్సై తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన సుమారు 50 మంది వలస కూలీలు బస్సులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.