కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది. దీంతో తిరుపతికి వెళ్లాల్సిన 57 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం గంటలో పూర్తి చేయవచ్చు. 71వ నేషనల్ హైవే పూర్తి కావడంతో వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. గతంలో నాయుడుపేట - రేణిగుంట మధ్య ప్రయాణం నరకంలా ఉండేది. వాహనాల రద్దీతో పాటు కేవలం రెండు వరుసలతో, అధ్వానంగా రోడ్డు ఉండేది. దీంతో వాహనదారులు ఈ దారి గుండా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పెద్ద సంఖ్యలో ప్రమాదాలు కూడా జరిగేవి. 57 కిలోమీటర్లకు ప్రయాణానికి రెండు మూడు గంటల సమయం పట్టేది.
అయితే ఇప్పుడు నేషనల్ హైవే పూర్తి కావడంతో ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. కోల్‌కతా - చెన్నై నేషనల్ హైవేలో నాయుడుపేట వద్ద మొదలై శ్రీకాళహస్తి, ఏర్పేడు మీదుగా కడప - రేణిగుంట, చెన్నై జాతీయ రహదారిలోని రేణిగుంటకు సమీపంలో ఈ రహదారి కలుస్తుంది. 2022 జనవరి 31న ఈ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. దీని నిర్మాణానికి రూ.1931 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ రహదారిని నిర్మించింది. నాయుడుపేట వద్ద ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మించగా.. రేణిగుంట దగ్గర రౌండ్ అబౌట్ నిర్మించారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు వద్ద బైపాస్‌లు నిర్మించారు. లోకల్ వెహికల్స్ హైవే మీదకు రాకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించారు. ఏర్పేడు వద్ద టోల్‌ప్లాజా నిర్మించారు.