AP Skill Development Scam:చంద్రబాబు కేసులో కాసేపట్లో తీర్పు.. రిమాండ్‌ విధిస్తే నేరుగా ఆ జైలుకే

టీడీపీ అధినేతపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి , చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.

By అంజి  Published on  10 Sept 2023 4:02 PM IST
ACB Court, AP Skill Development Scam case, Chandrababu, APnews

ACB Court, AP Skill Development Scam case, Chandrababu, APnews

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి , చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు విన్న జిల్లా అదనపు న్యాయమూర్తి హిమబిందు తీర్పును రిజర్వ్ చేశారు. చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలని సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ కోర్టును కోరారు. చంద్రబాబు అరెస్టుపై మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కోర్టు బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.

విజయవాడలోని ఏసీబీ కోర్టును ముట్టడించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కార్యకర్తలను వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణా టాటా ఏసీబీ కోర్టులో భద్రతా చర్యలను తనిఖీ చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు కాన్వాయ్‌ను సిద్ధం చేశారు. చంద్రబాబుకు.. న్యాయమూర్తి రిమాండ్‌ ప్రకటిస్తే రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు కాన్వాయ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తే రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ పలు కీలక విషయాలను పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన కుట్రదారుడని పేర్కొంది. ప్రజాప్రతినిధిగా ఉండి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తెలిపింది. 15 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరింది. 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగింది రిమాండ్ రిపోర్టులో వివరించింది. 271 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ37గానే పేర్కొంది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారించగా.. ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఏ37గా చంద్రబాబును పేర్కొన్నారు.

Next Story