Breaking: చంద్రబాబుకు రిమాండ్‌.. రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో 36 గంటల తర్వాత ఉత్కంఠ వీడింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.

By అంజి  Published on  10 Sep 2023 1:36 PM GMT
ACB court, Chandrababu, AP skill development scam case, APnews

Breaking: చంద్రబాబుకు రిమాండ్‌.. రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో 36 గంటల తర్వాత ఉత్కంఠ వీడింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. సుదీర్ఘంగా ఏడు గంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూద్ర వాదనలకు న్యాయమూర్తి అంగీకరించలేదు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలను ఏకీభవిస్తూ చంద్రబాబును రిమాండ్‌కు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ రాత్రి సిట్‌ ఆఫీస్‌కి చంద్రబాబును తరలించనున్నారు. రేపు ఉదయం చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే అవకాశం ఉంది.

ఈ నెల 22 వరకూ చంద్రబాబుకు కోర్టు రిమాండ్‌ విధించింది. కాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబుని అరెస్ట్‌ చేసినట్టు ఏపీ సీఐడీ తెలిపింది. రూ.271 కోట్ల స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్టు తెలిపింది. ఈ కేసులో తాజాగా చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు శాంతిభద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేతకు రిమాండ్‌ విధించడంతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. చంద్రబాబు బెయిల్‌ అప్లికేషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది లుథ్రా కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రూ. 371 కోట్ల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిధులు విడుదల చేయడంలో ప్రధాన నిర్ణయాధికారిగా చెప్పబడుతున్నాడు.సెప్టెంబర్ 9 న నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (APCID) అరెస్టు చేసింది. ఈరోజు సిట్ కార్యాలయంలో ఉంచిన ఆయనను రేపు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు. ఆయన న్యాయవాద బృందం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 22 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. శనివారం నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకెళ్లారు.

అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబును ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టును చుట్టుముట్టిన టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. టీడీపీ శ్రేణులను వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణా టాటా ఏసీబీ కోర్టులో భద్రతా చర్యలను తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ1, ఏ2గా మాజీ ప్రభుత్వ ఉద్యోగులైన జీ సుబ్బారావు, కే లక్ష్మీనారాయణలను సీఐడీ పేర్కొంది.

Next Story