దూసుకొస్తున్న వాయుగుండం.. నేడు ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. నేడు వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By అంజి  Published on  17 Oct 2024 6:55 AM IST
storm, coast, heavy rains, APnews, IMD

దూసుకొస్తున్న వాయుగుండం.. నేడు ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. నేడు వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్‌ఆర్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.

వాయుగుండం నేడు తీరం దాటే సమయంలో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఆస్కారం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ పోర్టులకు హెచ్చరికలు జారీ చేసింది. అటు వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి - నెల్లూరు మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 22 కిమీ వేగంతో కదులుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహ‍ణ శాఖ ప్రకటించింది. గురువారం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని చేరిన తర్వాత క్రమంగా బలహీనపడనుంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గడిచిన ఆరు గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతోందని అధికారులు తెలిపారు.

నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Next Story