గుడివాడ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. డిసెంబర్ 14వ తేదీ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఇవాళ తెల్లవారుజామున నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సెల్‌ఫోన్ షాపులో ప్రమాదం జరిగింది. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పడానికి శ్రమిస్తున్నారు. భారీ మంటలతో సమీప ప్రాంతాల నివాసదారులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనుంచి రోడ్లపైకి వచ్చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.