Video: పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన పెను ప్రమాదం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది
By - Knakam Karthik |
Video: పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన పెను ప్రమాదం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుకువెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడం వల్ల పెనుప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రమాదాన్ని తప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కొట్టుకువచ్చిన పడవలను నియంత్రించకపోతే బ్యారేజి వద్ద భారీ విధ్వంసం జరిగి ఉండేది. లోతట్టు ప్రాంతాలు భారీముంపునకు గురైయ్యేవి. ఈ సంఘటనతో మరోసారి అందరికీ 2024 బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజి ఘటన గుర్తుకొచ్చింది.
అసలు ఏం జరిగిందంటే
వరద ఉద్ధృతికి వంతెన రైలింగుకు కట్టేసిన పడవల తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పడవలు ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకువచ్చాయి. వాటిలో ఒక పడవను ఇసుక రేవు ప్రాంతానికి, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు చేర్చగలిగారు. మరో పడవ మాత్రం బ్యారేజి ఎగువన సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పాత ఆనకట్ట క్రెస్ట్ వద్ద నిలిచిపోయింది. ఒక వేళ ఆ బోట్లు అంతే వేగంగా వచ్చి సంఘం బ్యారేజి గేట్లను ఢీ కొట్టి ఉంటే విధ్వంసం జరిగి ఉండేది.
బోటు బరువు 35 టన్నులు ఉండడంతో బయటికి తరలించేందుకు ఇబ్బందులు పడ్డారు. బోటును బయటికి తీసేందుకు NDRF స్విమ్మర్స్ మరియు బృందం సభ్యులు సూమారు 12 గంటల పాటు శ్రమించి మూడు భారీ బోట్లు, తాళ్ళ సహాయంతో బోటును రెండు వైపుల కట్టి లంగర్ తో లాక్ చేశారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.