అనకాపల్లి: బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్రగాయాలు
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 24 Feb 2023 4:15 PM ISTబస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్రగాయాలు
ఆంధ్రప్రదేశ్: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద పెనుగొల్లు నేషనల్ హైవేపై బస్సును లారీ ఢీకొట్టింది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే టైంలో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందున్న మరో ఆటోను ఢీకొట్టి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను హుటాహుటినా నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోల్లో తరలించారు. విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పరిశీలించి క్షగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. యస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.