అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ..7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.

By Knakam Karthik
Published on : 4 April 2025 7:17 AM IST

Andrapradesh, Anakapalle district, Bulk Drugs Company, Employement, Cm Chandrababu

అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ..7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్ దాదాపు రూ.5,000 కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ల్యారెస్ ల్యాబ్స్ ఇప్పటికే విశాఖ పరిసర ప్రాంతాల్లో 2007 నుంచి పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇప్పటివరకు రూ.6,500 కోట్లతో తయారీ యూనిట్లు నెలకొల్పగా, 10 వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. లారెస్ ల్యాబ్స్ సంస్థకు బెంగళూర్, హైదరాబాద్‌లో కూడా యూనిట్లు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా రాంబిల్లిలో పరిశ్రమలు పెడుతోంది. ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్‌ ఉత్పత్తి చేయనుంది.

ఏపీలో సంస్థ విస్తరణపై కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో లారస్ ల్యాబ్స్ సంప్రదింపులు జరుపుతోంది. లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు గురువారం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. భూకేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రికి సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని చెప్పిన ముఖ్యమంత్రి... భూ కేటాయింపులతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని... సాధ్యమైనంత త్వరగా క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించాలని కోరారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పెద్దఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Next Story