సీఎం అధ్యక్షతన 4వ SIPB సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on  13 March 2025 6:02 PM IST
సీఎం అధ్యక్షతన 4వ SIPB సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని.. దీని కోసం ట్రాకర్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. గురువారం సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన 4వ ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్లు పెట్టుబడులతో ముందుకురాగా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. అలాగే, గత మూడు ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు.

రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎఈ పార్క్ చొప్పున మొత్తం 175 నియోజవకర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందలో భాగంగా మొదట జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెలరోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థల వెనుకపడాలని.... నిరంతరం ఫాలోఅప్ చేయాలని సిఎం సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు... క్షేత్ర స్థాయిలో ఆయా ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సిఎం సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి, ఫలితం కనిపిస్తుందని సిఎం అభిప్రాయపడ్డారు.

4వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన సంస్థల వివరాలు :

1) ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ : నాయుడుపేట - రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలు.

2) దాల్మియా సిమెంట్ : కడప జిల్లా - రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.

3) లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ : విశాఖపట్నం - రూ. 1,500 కోట్ల పెట్టుబడులు.

4) సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ – రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు.

5) ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు.

6) బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు.

7) ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.22,000 కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు

8) ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : అన్నమయ్య, కడప జిల్లాలు – రూ.8,240 కోట్లు, 4,000 ఉద్యోగాలు.

9) మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ : రూ. 400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.

10) ఒబేరేయ్ విలాస్ రిసార్ట్ : రూ. 250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు.

గత మూడు ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి ఎస్ఐపీబీ సమావేశం : విద్యుత్ రంగంలో రూ.11,902 కోట్లు, ఇతర రంగాల్లో రూ.72,085 కోట్లు... మొత్తం రూ. 83,987 కోట్లు ఆమోదం తెలిపింది. దీంతో 29,585 మందికి ఉద్యోగ అవకాశాలు.

రెండవ ఎస్ఐపీబీ సమావేశం : విద్యుత్ రంగంలో రూ.83,000 కోట్లు, ఇతర రంగాల్లో రూ.99,162 కోట్లు... మొత్తం రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగ అవకాశాలు.

మూడవ ఎస్ఐపీబీ సమావేశం : విద్యుత్ రంగంలో రూ.42,932 కోట్లు, ఇతర రంగాల్లో 1,844 కోట్లు... మొత్తం రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి రాకతో 19,580 ఉద్యోగాలు లభిస్తాయి.

ఇప్పటివరకు నాలుగు ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.4,32,584 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా మొత్తం 3,92,680 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

Next Story