4 గంటల శ్రమ.. సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం..!
అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న ప్రసవాన్ని కూడా సహజంగా జరిపారు.
By - Medi Samrat |
అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న ప్రసవాన్ని కూడా సహజంగా జరిపారు. దీంతో పండంటి మగ బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. శిశువు బరువు 4.8 కేజీలు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు ఇది రెండో కాన్పు. వైద్య సిబ్బంది చొరవను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని సూచించారు.
ఇదే ఆస్పత్రిలో రూపవతికి తొలి కాన్పు
పెందుర్తి ప్రాంతానికి చెందిన కె. రూపవతి (25) 9 నెలలు నిండడంతో నొప్పులతో మంగళవారం అర్థరాత్రి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఈమెకు 8నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా శిశువు బరువు 3 కేజీలుగా ఉన్నట్లు భావించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ లేదా సహజ ప్రసవం చేసేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రూపవతికి ఇదే ఆసుపత్రి లో తొలి ప్రసవం సహజ విధానంలో జరిగింది.
భుజాలు బయటకు రావడంలో అవరోధం
శిశువు తల ముందుకు వచ్చినప్పటికీ భుజాలు రావడంలో సమస్య తలెత్తింది. శిశువు బరువుగా ఉన్నందున తల ముందుకు వచ్చినట్లు భుజాలు బయటకు వచ్చేందుకు సాధ్యపడలేదు. సిజేరియన్ తప్పదేమో అని అనుకున్నారు. అయితే.. 'వుడ్స్ కార్క్ స్క్రూ ' (మ్యాన్అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, భుజాలు బయటకు వచ్చేలా వైద్యులు చేశారు. దీనివల్ల సిజేరియన్ కు బదులు సహజ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సెకండరీ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగడం చాలా అరుదు అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. సుమారు 4 గంటలపాటు వైద్యులు డాక్టర్ సౌజన్య డాక్టర్ మానస (పీజీ థర్డ్ ఇయర్ స్టూడెంట్), స్టాఫ్ నర్సులు జగదీశ్వరి, జే.కుమారి, ఎఎన్ఎం సరస్వతి శ్రమించారని తెలిపారు.
రిస్కు అధికంగా ఉన్నా..
ఒక్కోసారి బరువు అధికంగా ఉన్న శిశువులకు ఊపిరి తీసుకోవడం కష్టంకావొచ్చు. అలాగే తల్లికి బ్లీడింగ్ సమస్య ఎక్కువవుతుంది. ఇవికాకుండా పెర్నియల్ టియర్ (యోని చీలిక) వంటి తలెత్తే ఇతర సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని వైద్యులు తీసుకున్న జాగ్రత్తలవల్ల సహజ ప్రసవం సాధ్యమైంది. సాధారణంగా ఇలాంటి పద్ధతులు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతుంటాయి. వీటికి భిన్నంగా అనకాపల్లి జిల్లా అసుపత్రిలో అసాధారణ రీతిలో సహజ ప్రసవం జరగడం విశేషం. అధిక బరువు కలిగిన శిశువులను మాక్రోసోమియా కేసుగా పరిగణిస్తారు. ప్రసవ సమయంలో తల్లికి, బిడ్డకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా వైద్యులు 4 కేజీలు లేదా 4. 5 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు కలిగిన శిశువులకు సిజేరియన్ సెక్షన్ సూచించే అవకాశాలు ఎక్కువ. కానీ, వైద్యులు చూపిన చొరవతో సహజ ప్రసవం జరిగినందున శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు.
సహజ ప్రసవాలు పెరగాలి : మంత్రి సత్యకుమార్ యాదవ్
నూతన సంవత్సరంలోనూ ఇటువంటి చొరవ ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగాలన్న ఆకాంక్షను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో నెలకు 400 వరకు ప్రసవాలు జరుగతుంటే అందులో 65% నుంచి 70% వరకు సహజ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. సహజ ప్రసవాల నిర్వహణకు వైద్యులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. " పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండే ప్రభుత్వాసుపత్రులే ముఖ్యం. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు చూపిన చొరవ రోగుల్లో ఆత్మసైర్థ్యాన్ని నింపుతోంది. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో డీఎన్బీ విధానంలో చదువుతున్న పీజీ విద్యార్థిని కూడా సహజ ప్రసవం జరిగేలా చేయడంలో శ్రద్ధ కనబరిచారు.. వైద్యులు, అధికారులకు అభినందనలు." అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.