ఆంధ్రప్రదేశ్ పోలీసులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రూ.1.91 కోట్ల విలువైన 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీ, ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కడప జిల్లా పోట్లదుర్తి గ్రామ సమీపంలోని ప్రొద్దుటూరు-యర్రగుంట్ల రహదారిపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం దుంగలతో కూడిన మినీ లారీని పోలీసులు అడ్డుకున్నారు.
"మేము ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసాము. ఈ నేరానికి సూత్రధారి, ఇతర నిర్వాహకులను కూడా మేము గుర్తించాము. మేము వారిని కూడా అతి త్వరలో అరెస్టు చేస్తాము" అని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎర్రచందనం స్మగ్లర్ బాద్షా మజీద్ మాలిక్, విజయ్ సుబ్బన్న పూజారితో సహా అతని సహచరులకు చెందిన రూ.72.45 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల వద్ద ఉన్న కంపెనీల నకిలీ పత్రాలను సమర్పించి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) బాద్షా, విజయ్, ఇతరులపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.