బాత్రూంలు కడిగిస్తున్నారని, ఫుడ్‌ పెట్టడం లేదని.. పారిపోయి కొండల్లో దాక్కున్న 37 మంది విద్యార్థులు

పల్నాడు జిల్లా వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు.

By అంజి  Published on  24 Sept 2024 10:00 AM IST
students escaped, Gurukula Hostel, Vankayalapadu, Palnadu, APnews

బాత్రూంలు కడిగిస్తున్నారని, ఫుడ్‌ పెట్టడం లేదని.. పారిపోయి కొండల్లో దాక్కున్న 37 మంది విద్యార్థులు

పల్నాడు జిల్లా వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37 మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఆహారం సరిగ్గా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే 30 మందిని పట్టుకున్నారు. మరో 37 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తప్పించుకున్న విద్యార్థుల కోసం గాలించారు. చివరకు తుమ్మపాలెం వద్ద పిల్లలను గుర్తించిన పోలీసులు వారిని గురుకులానికి తీసుకెళ్లారు.

అనంతరం నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్‌ సీఐ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమను ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపించారు. సరైన ఫుడ్‌, మంచి నీరు అందించడంలేదని వాపోయారు. ఆడుకునేందుకు సైతం అవకాశం కల్పించడంలేదని, నిత్యం పరీక్షలంటూ వేధిస్తున్నారని, ఉచిత విద్యకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ మాట్లాడుతూ నిజానిజాలను దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Next Story