విశాఖలో ఘోరం..బిస్కెట్ల ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారులపై అకృత్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 3:17 PM IST

Andrapradesh, Vizag Crime, Visakhapatnam, POCSO Act, Sexual Assault

విశాఖలో ఘోరం..బిస్కెట్ల ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారులపై అకృత్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మదనపల్లె ఘటన మరువకముందే విశాఖలో మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నం పెదగంట్యాడ మండలంలోని గంగవరం పరిధిలో గురువారం ఒక కిరాతక ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై తండ్రి స్నేహితుడే లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. బాధితురాలి తండ్రిని కలిసే నెపంతో ఇంటికి వచ్చిన నిందితుడు, ఆయన ఇంట్లో లేకపోవడంతో బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు.

నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టి, అనంతరం బాలికను ఇంట్లో వదిలి పరారయ్యాడు. చిన్నారి ఎడతెరిపి లేకుండా ఏడుస్తుండటంతో గమనించిన తల్లి, ఆమె దుస్తులపై రక్తపు మరకలను చూసి షాక్‌కు గురై పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిపై BNS మరియు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు.

మదనపల్లెలో విషాదాంతం

రెండు రోజుల క్రితమే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యమై, చివరకు పొరుగువాడి ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో శవమై తేలింది. నిందితుడు కులవర్ధన్ ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అనంతరం నిందితుడు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story