రోజుకు 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అయిన “స్త్రీ శక్తి” పథకం మహిళల్లో నూతనోత్సాహాన్ని, ఆహ్లాదాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
By Medi Samrat
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అయిన “స్త్రీ శక్తి” పథకం మహిళల్లో నూతనోత్సాహాన్ని, ఆహ్లాదాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళల గౌరవార్థం 79 వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇచ్చిన కానుక అన్నారు. ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్నదని, రోజుకి దాదాపు 25 లక్షల మంది మహిళలు ఐదు రకాల ఆర్.టి.సి. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆమె తెలిపారు.
సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని, వారి అభ్యున్నతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ మరియు వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం జరుగుచున్నదన్నారు. APSRTC కి ఉన్న మొత్తం బస్సుల్లో దాదాపు 74 శాతం అంటే 8,458 బస్సుల్లో రాష్ట్రంలోని మహిళలలు, ట్రాన్స్జండర్లు, బాలికలు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని చంద్రన్న ప్రభుత్వం కల్పించిందన్నారు. పల్లెవెలుగు (PVG), అల్టా పల్లెవెలుగు (UPVG), సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ (EXP) మరియు మెట్రో ఎక్స్ ప్రెస్ (M-EXP) బస్సులలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు మహిళలకు కలుగుతుందని, గ్రామీణ ప్రాంత మహిళలు, బాలికలు పట్టణాల్లో ఉన్నత చదువులు, ఇతర ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. రోజు వారీగా పనిచేసుకునే మహిళలకు, చిన్నపాటి మహిళా ఉద్యోగస్థులకు, విద్యార్థినులకు, చిరువ్యాపారులకు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణ ఖర్చుల భారం తగ్గిపోయిందన్నారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రయాణ ఛార్జీల రూపంలో నెలకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదా అవుతుందన్నారు. ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక పొదుపును తీసుకురావడమే కాకుండా, శుభకార్యాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే, తీర్థయాత్రలు చేసే మహిళలు, వృద్ధులకు ఎంతో గానో ప్రయోజనకరంగా మారిందన్నారు.
ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు సమర్థిస్తుంటే, ఒక్క వైఎస్ఆర్సిపికి చెందిన ప్రతినిధలు మాత్రమే లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కొండ ప్రాంతాల్లోని ఘాట్ రోడ్లలో మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించలేదన్నారు. ప్రధాన ప్రతి పక్ష పార్టీ సభ్యులు అక్కసుతో చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం నిజంలేదని ఆమె స్పష్టం చేశారు.