AP Weather: 218 మండలాల్లో వేడిగాలులు.. పలు చోట్ల వర్షాలు

ప్రతిరోజూ వాతావరణ నివేదికను అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బుధవారం మరోసారి 12 మండలాల్లో

By అంజి  Published on  7 Jun 2023 12:30 PM IST
AP Weather, heatwaves ,  rains, APnews

AP Weather: 218 మండలాల్లో వేడిగాలులు.. పలు చోట్ల వర్షాలు 

ప్రతిరోజూ వాతావరణ నివేదికను అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బుధవారం మరోసారి 12 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 218 మండలాల్లో ఒక మోస్తరు వేడిగాలులను అంచనా వేసింది. గురువారం 31 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 260 మండలాల్లో ఒక మోస్తరు వేడిగాలులు ప్రభావం చూపుతాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. మంగళవారం అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 45 డిగ్రీలు, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలు పొడిగా ఉంటాయి. కాగా, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుంది. దీనికి బంగ్లాదేశ్‌ను సూచించే 'బిపార్జోయ్' అని పేరు పెట్టారు. తుపాను అరేబియాలో మరో తొమ్మిది రోజుల పాటు ఉత్తర దిశగా కొనసాగి తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది.

Next Story