ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న హోటల్ కు 21 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్ కు కరెంటు బిల్లు వచ్చింది. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో ఆ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు.
సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు.