పాఠశాలల్లో కరోనా కలకలం.. ఒక్క‌రోజే 17 పాజిటివ్ కేసులు

17 Corona Positive in schools at Prakasam District.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ప్ర‌కాశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2022 10:57 AM IST
పాఠశాలల్లో కరోనా కలకలం.. ఒక్క‌రోజే 17 పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ప్ర‌కాశం జిల్లాలోని స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌వ‌రం రేపుతోంది. మంగ‌ళ‌వారం ఒక్క రోజే పాఠ‌శాల‌ల్లో 17 పాజిటివ్ కేసులు వెలుగుచూడ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అందులో 15 మంది ఉపాధ్యాయులు.. ఇద్ద‌రు బోధ‌నేత‌ర సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌, ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇద్దరు చొప్పున క‌రోనా బారిన ప‌డ‌గా.. ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ పాఠ‌శాలల్లో ఒక్కక్కరు చొప్పున ఉపాధ్యాయుల‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఇక త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి క‌రోనా సోకింది. బాధితుల‌ను హోంఐసోలేష‌న్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. సంక్రాంతి సెల‌వులు ముగిసిన అనంత‌రం సోమ‌వారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్ని పునఃప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇక రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న కొత్త‌గా 6,996 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,7384కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514గా ఉంది. 24 గంటల వ్యవధిలో 1,066 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,66,762కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,19,22,969 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story