మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి ఏపీ వాసులు రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో 144 మంది తెలుగువారు ఏపీకి బయలుదేరారు. ఈ ప్రత్యేక విమానం ఖాట్మాండూ నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విమానంలో విశాఖకు 104 మంది, మరో 40 మంది తిరుపతికి ఏపీ వాసులు చేరుకోనున్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం చేసింది. ఈ క్రమంలోనే విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారికి స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇదిలావుంటే.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం రెండు రోజులుగా మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేసిన నారా లోకేష్ కు ఏపీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.