టీడీపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశామని విజయవాడ సీపీ వెల్లడించారు. పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు.. రాత్రి పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశామని.. దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను పోలీసులు విడుదల చేశారు.
పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని.. డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. పట్టాభిని పోలీసులు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైలులోకి తీసుకెళ్లారు.