10th Exams: రేపటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ: రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 3 నుంచి అంటే సోమవారం నుంచి ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
By అంజి Published on 2 April 2023 5:22 AM GMTరేపటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ: రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 3 నుంచి అంటే సోమవారం నుంచి ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు ఏప్రిల్ 13న ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాల్లో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటల పాటు జరుగుతాయి. సైన్స్, కాంపోజిట్ పేపర్లకు 20 నిమిషాల గ్రేస్ టైమ్ కేటాయించబడుతుంది. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హాల్‌టికెట్లు చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సిట్టింగ్ స్క్వాడ్‌లను మోహరించింది. మరోవైపు, వేసవి సెలవుల తర్వాత జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) తెలిపింది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి టీఎస్‌బీఐఈ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. TSBIE ప్రకారం.. కళాశాలలకు 77 సెలవులు, 227 పని దినాలు, పబ్లిక్ పరీక్షలు మార్చి 2024 మొదటి వారంలో నిర్వహించబడతాయి.
ఆంధ్రప్రదేశ్: రేపు అంటే ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం పరీక్షల వివరాలను వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుందని తెలిపిన బొత్స సత్యనారాయణ.. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, సరైన కారణాలతో తప్ప ఆ తర్వాత ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లు చూపించి APSRTC బస్సు సర్వీసులను వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆరు రోజులలో ఆరు పేపర్‌లకు పరీక్షలు నిర్వహించబడతాయి. ఇందులో 6,09,070 మంది విద్యార్థుల్లో 53,410 మంది సప్లిమెంటరీ పరీక్షల విద్యార్థులు హాజరవుతారు. 682 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో 3,349 పరీక్షా కేంద్రాలను, 104 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు, పరీక్షలు జరిగే పాఠశాల ఆవరణలో మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని నిషేధించారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా హెడ్‌ఫోన్‌లు అందించే అవకాశాన్ని కూడా విద్యాశాఖ కల్పించింది.