కొత్త అల్లుళ్లకి మర్యాదలు చేసే విషయంలో గోదారోళ్లే కాదు తాము కూడా తగ్గేదిలేదంటున్నారు నెల్లూరోళ్లు. తన కూతురిని పెళ్లి చేసుకున్న తరువాత తొలి సారి ఇంటికి వచ్చిన అల్లుడికి జీవితాంతం గుర్తుండి పోయేలా విందును ఇచ్చాడు మామ. ఒకటి కాదు.. పది కాదు.. యాభై కాదు.. ఏకంగా 108 రకాలను వంటకాలను అల్లుడి కోసం చేయించారు.
పొదలకూరు మండలంలోని ఊసపల్లి గ్రామంలో ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కూతురు శివానికి నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన ఉమ్మడిశెట్టి శివకుమార్‌తో ఇటీవల పెళ్లి చేసేశారు. పెళ్లైన తరువాత తొలి సారి అల్లుడు ఇంటికి వస్తుండడంతో జీవితాంతం అతడికి గుర్తు ఉండపోయేలా మర్యాదలు చేయించాలని బావించాడు మామ శివకుమార్.
అనుకున్నదే తడవుగా 108 రకాల వంటకాలను సిద్ధం చేయించాడు. ఆ వంటకాలలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు వంటి నాన్‌వెజ్‌తో పలు రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓ టేబుల్‌పై అన్ని వంటకాలను ఉంచి అల్లుడు, కూతురిని కూర్చోబెట్టారు. విందు ఆరగింపు సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు పలువురు పెళ్లికాని ప్రసాదులు... మాకు కూడా ఇలాంటి మామ దొరికితే బాగుండు అని అనుకుంటున్నారు.
మామ పేరు శివకుమార్ కాగా అల్లుడి పేరు కూడా శివకుమార్ కావడం ఇక్కడ విశేషం.