ఇంగ్లీష్‌ vs తెలుగు.. అసెంబ్లీ సమావేశాల్లో రగడ..!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 7:26 AM GMT
ఇంగ్లీష్‌ vs తెలుగు.. అసెంబ్లీ సమావేశాల్లో రగడ..!

ముఖ్యాంశాలు

  • ఏపీ అసెంబ్లీలో రగడ..!
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఆగ్రహం
  • ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు: సీఎం జగన్‌
  • తెలుగు మీడియం కూడా ఉండాలన్నదే మా అభిప్రాయం: చంద్రబాబు

అమరావతి: ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేతలు తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ చైర్‌ను అవమానించారంటూ తమ్మినేని సీతారామ్‌ మండిపడ్డారు. ప్రతిపక్షాలపై గౌరవం ఉందని.. కానీ ఇష్టానుసారం స్పీకర్‌పై ఆరోపణలు చేస్తే మంచిది కాదన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు.

విప్లవాత్మక నిర్ణయం..

పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలన్న విధానం మీద చంద్రబాబు వైఖరి దారుణమని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం జగన్‌ అన్నారు. ఇంగ్లీష్ మీడియం ఉండాలి, తెలుగు మీడియం ఉండాలి ఇప్పుడు చెప్తున్నారని జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుకుంటున్న వారి సంఖ్య 65 శాతమని.. కేవలం 35 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ చదువుతున్నారని సీఎం జగన్ తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం చదువుకుంటున్న వారి సంఖ్య 94 శాతమన్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దగ్గరుండి ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించారన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో పోటీపడాలంటే.. ఇంగ్లీషును ఒక్క హక్కుగా నేర్చుకోవాలన్నారు. అదే తపన, తాపత్రయంతో అన్ని స్కూళ్లను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లగా చేయడానికి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

చంద్రబాబు ఏం చేసినా సరే అందులో రాజకీయమే కనిపిస్తోందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చాలనుకుంటే ఎవరూ ఆపగలిగే పరిస్థితి ఆనాడు లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు ఏం చేసినా వక్రీకరణ కనిపిస్తోందన్నారు. ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయారో చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. ఊరికే ఎదో కారణం చూపించాలి, ఒకరి మీద వేలెత్తి చూపించాలి, వక్రీకరించాలని చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ, చంద్రబాబు మనకు ముఖ్యమంత్రిగా పనిచేశారని రాష్ట్రమంతా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితిలోకి వచ్చిందన్నారు. రేపు ఇంగ్లీష్ మీడియం అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని.. అందులో చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పొచని సీఎం జగన్ తెలిపారు.

కాగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు కూడా ఉండాలన్నదే మా అభిప్రాయమన్నారు. తాను చేసిన కృషి వల్లే చాలా మంది రాష్ట్రానికి వచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు భాష ప్రాతిపదిక మీదే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చంద్రబాబు విద్యార్హతలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపణలు చేశారు. 50 ఏళ్లుగా చం ద్రబాబు పీహెచ్‌డీ చేస్తూనే ఉన్నారని చెవిరెడ్డి వాఖ్యలు చేశారు. కాగా చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. టీడీపీ సభ్యులు స్పీకర్‌ తమ్మినేనితో వాగ్వాదానికి దిగారు.

Next Story
Share it